
2018 సెప్టెంబర్ 17 నుండి 19 వరకూ న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో మూడు రోజులపాటు జరిగిన “భవిష్య భారతం” సమావేశాలలో వివిధ విషయాలపై RSS సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారు. ఆ సందర్భంగా భారత జాతీయ పతాకం, కాషాయ ధ్వజాల విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కున్న కల్పనపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ ఒకసారి ఆ విషయాలను వారి మాటల్లోనే యదాతథంగా గుర్తు చేసుకుందాం…..
“రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం ఆధారితమైనది. మన ఖర్చులకు అవసరమయ్యే నిధిని మనమే సమకూర్చుకుంటాం. సంస్థను నడపడానికి బయట నుంచి ఒక్క పైసా కూడా తీసుకోం. ఎవరైనా చందాలు ఇస్తామని వచ్చినా మనం దానిని తిరస్కరిస్తాం. RSS పూర్తిగా స్వయంసేవకుల గురుదక్షిణపై మాత్రమే ఆధారపడుతుంది. మనమంతా ప్రతి సంవత్సరం, గురువుగా గౌరవించబడే పరమ పవిత్ర భగవాధ్వజానికి గురుదక్షిణ సమర్పిస్తాం.
భగవాధ్వజాన్ని మనం గురువుగా భావిస్తాం? ఎందుకంటే…. భగవాధ్వజం అనాదిగా మన సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక. చరిత్రను స్మరించుకున్నప్పుడల్లా మనకు ఆ చరిత్ర పుటలలో కాషాయ జెండా రెపరెపలు కనిపిస్తూనే ఉంటాయి. స్వతంత్ర భారతదేశానికి ఏ జెండా ఉండాలనే చర్చ వచ్చినప్పుడు ఫ్లాగ్ కమిటీ తన నివేదికలో పరమ పవిత్ర భగవాధ్వజమే జాతీయ జెండాగా ఉండాలని సిఫార్సు చేసింది.
కానీ తర్వాత దాని స్థానంలో త్రివర్ణ పతాకం వచ్చింది. అది మన జాతీయ పతాకం, దాని పట్ల మనకు అత్యంత గౌరవం ఉంది. “శాఖలో భగవాధ్వజాన్నేఎందుకు ఎగురవేస్తారు? జాతీయ జెండాను ఎందుకు ఎగురవేయరు?” అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. నిజానికి ప్రారంభం నుండి కూడా సంఘం జాతీయ జెండాపై అపరిమితమైన భక్తి ప్రపత్తులు కలిగివుంది. త్రివర్ణ పతాకంతో సంఘానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది.
ఒక యదార్థ సంఘటన గురించి చెబుతాను. జాతీయ పతాకంగా త్రివర్ణ పతాకం ఉండాలని నిర్ణయించినప్పుడు మొదట్లో దాని మధ్యలో చరఖా చిహ్నం ఉండేది. అప్పటికి జాతీయ పతాకంపై అశోకచక్రం ఇంకా రాలేదు. ఫైజాపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో చరఖా చిహ్నంతో కూడిన జాతీయజెండాను మొదటిసారిగా ఎగురవేయాలని నిర్ణయించారు. జెండా స్తంభం ఎత్తు 80 అడుగులు. సభకు నెహ్రూ అధ్యక్షత వహించారు. జెండా ఎగురవేస్తున్నప్పుడు అనుకోకుండా మధ్యలో జెండా ఇరుక్కుపోయింది. ఇప్పుడు అంత ఎత్తుకు ఎక్కి సరిచేసే వ్యక్తి కావాలి.
అకస్మాత్తుగా, గుంపులో నుండి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. పరుగెత్తుకుంటూ వచ్చి అంత ఎత్తు స్తంభాన్ని ఎక్కి, ముడులు విప్పి జెండాను సరిచేసి క్రిందికి దిగాడు. నెహ్రూజీ అతని వీపు తట్టి, సాయంత్రం బహిరంగ సభకు సన్మానం కోసం రమ్మని చెప్పారు. అప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు నెహ్రూ దగ్గరకు వెళ్లి ఆ యువకుడు శాఖకు వెళుతున్నందున అతన్ని సన్మానానికి ఆహ్వానించవద్దని చెప్పారు. ఆ స్వయంసేవక్ పేరు శ్రీ కిషన్ సింగ్ రాజ్‌పుత్. జల్గావ్ నివాసి. ఆయన ఐదారేళ్ల క్రితమే స్వర్గస్తులయ్యారు. కాంగ్రెస్ సభల్లో స్వయంసేవక్ జెండాను సరిచేసిన సంగతి తెలుసుకున్న డాక్టర్ హెడ్గేవార్ జల్గావ్ కు వెళ్లి అతనికి ఓ వెండి కుండను బహూకరించారు. కాబట్టి మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినప్పటి నుండి, సంఘ స్వయంసేవకులకు దానిపట్ల అపరిమితమైన గౌరవం ఉంది.
లాహోర్ సభలలో కాంగ్రెస్ మొదటిసారిగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానాన్ని ఆమోదించినప్పుడు, అన్ని శాఖలూ సమావేశాలు నిర్వహించి, కాంగ్రెస్ ను అభినందిస్తూ తీర్మానాలను చెయ్యాలని, వాటిని కాంగ్రెస్ కమిటీకి పంపాలని డాక్టర్ హెడ్గేవార్ అన్ని RSS శాఖలకూ సర్క్యులర్ జారీ చేశారు. ఇది 1931లో జరిగింది. భారతదేశ స్వాతంత్ర్య సాధన, దేశం యొక్క పరమవైభవం…. ఇవే డా. హెడ్గేవార్ జీవిత లక్ష్యాలు. సంఘంలో వేరింకేమీ లేదు. అందుకే స్వయంసేవకులు స్వాతంత్య్ర చిహ్నాలన్నిటినీ ఎంతగానో గౌరవిస్తారు. ఈ విషయంపై రెండో మాటకు సంఘంలో తావులేదు కూడా.





