News

అమితాబ్‌, ప్రభాస్‌, కోహ్లీ నోట.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాట..

441views
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ సెలెబ్రిటీల ‘ఇంటింటా జెండా’ గీతం

ముంబాయి: భార‌త‌దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గడుస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసేలా ‘హర్‌ ఘర్‌ తిరంగా ‘ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 13 నుంచి 15 వరకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడుతూ అణువణువునా దేశభక్తి చాటేలా రూపొందించిన ఈ గీతంలో సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అంటూ తమ గళం కలిపారు. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌, జాకీ ష్రాఫ్‌, అనుపమ్ ఖేర్‌, వరుణ్‌ ధావన్‌, అనుష్క శర్మ, కీర్తి సురేశ్‌, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ పాటు క్రీడా ప్రముఖులు కపిల్‌ దేవ్‌, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, మేరీ కోమ్‌, మీరాబాయి చాను, మిథాలీ రాజ్‌, పీటీ ఉష తదితరులు జెండా చేతబట్టి హర్‌ ఘర్‌ తిరంగా అంటూ పాడారు. అమితాబ్‌ హిందీలో పాడగా.. ప్రభాస్‌ ‘ఇంటింటా జెండా’ అంటూ తెలుగులో, కీర్తి సురేశ్ తమిళంలో గళం కలిపారు. చివర్లో ప్రధాని మోదీ చిన్నారులతో ఆనందంగా కరచాలనం చేస్తూ కన్పించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి