
-
తైవాన్‌లో పర్యటించి తీరుతాను
-
స్పష్టం చేసిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్
-
తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన డ్రాగన్ దేశం
న్యూఢిల్లీ: తైవాన్ పర్యటన విషయంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఆసియా పర్యటనలో ఉన్న పెలోసీ.. తైవాన్‌లో అడుగుపెట్టనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం తైవాన్‌కు వెళ్లి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పెలోసీ సమావేశమవుతారని అమెరికా వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.
తైవాన్ అధ్యక్షుడు తాయి ఇంగ్ వెన్తోనూ భేటీ కానున్నట్టు తెలిపింది. మంగళవారం అక్కడే ఉండి.. బుధవారం తిరుగుపయనం కానున్నట్టు పేర్కొంది. తైవాన్‌లో పర్యటిస్తానని పెలోసీ చేసిన ప్రకటన.. చైనా- అమెరికాల మధ్య అగ్గిరాజేసింది.
తైవాన్‌లో పెలోసీ అడుగుపెడితే.. అత్యంత తీవ్రమైన పర్యవసనాలు ఉంటాయని చైనా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం.. తైవాన్ వెళ్ళొద్దని పెలోసీకి సలహా ఇచ్చారు. అయినప్పటికీ స్పీకర్ వెనక్కి తగ్గడం లేదు. అయితే, ఆదివారం విడుదలైన ఆసియా పర్యటన వివరాల్లో మాత్రం తైవాన్ ప్రస్తావన లేదు.
సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లలో మాత్రమే పర్యటించనున్నట్టు ఆమె కార్యాలయం వెల్లడించింది. చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ నేతలు పెలోసీ పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై అమెరికాలో రాజకీయ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం ఆమె తైవాన్‌లో పర్యటించాలని కోరుతోంది.





