News

750 మంది బాలికల చేతిలో త‌యారైన ‘ఆజాదీ శాట్’

528views
  • ఆగస్టు మొదటి వారంలో అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

న్యూఢిల్లీ: దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ మేరకు తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలల్లో ఎనిమిదోతేదీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 మంది బాలికలను నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో ఎంపిక చేశారు. ‘అంతరిక్షంలో మహిళలు’ అనే ఐక్యరాజ్య సమితి థీమ్‌ నేపథ్యంలో ‘ఆల్‌ ఉమెన్‌ కాన్సెప్ట్‌’తో దీన్ని రూపొందిస్తున్నారు. ఎనిమిది కిలోల బరువున్న ఉపగ్రహం సమాచార సేవలందించనుంది.

ఆజాదీశాట్‌ తయారీలో నారాయణవనం జడ్పీ ఉన్నత పాఠశాల (తిరుపతి జిల్లా), సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బాలికల పాఠశాల(సికింద్రాబాద్‌), గురజాగుంట(తెలంగాణ), జేసీ ఎర్రుపాలెం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ (తెలంగాణ), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌, కురుగుంట (అనంతపురం), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం వీరలంకపల్లి(ఆంధ్రప్రదేశ్‌), జడ్పీ ఉన్నత పాఠశాల, జి.ఆర్మూరు(తెలంగాణ), జీహెచ్‌ఎస్‌, వెంగళ్‌రావునగర్‌(హైదరాబాద్‌)కు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం ఉంది.

ఇందుకు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. సాయం అందించిన 15 మంది స్పేస్‌ కిడ్జ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో తిరుపతికి చెందిన సాయి, రఘుపతి, హైదరాబాద్‌కు చెందిన కీర్తన్‌ ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి