
న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో వెనకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.317 కోట్ల్ల గ్రాంట్ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. దేశంలో 374 జిల్లాలు విద్యాపరంగా వెనకబడినట్టు యూజీసీ నిపుణుల సంఘం గుర్తించిందని తెలిపారు. ఏపీలోని అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విద్యలో వెనకబడిన జిల్లాలుగా గుర్తించినట్టు చెప్పారు.
ఈ జిల్లాల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) జాతీయ సగటు అయిన 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు యూజీసీ నిపుణుల సంఘం నిర్ధారించిందన్నారు. విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని గుర్తించి అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.





