ArticlesNews

శ్రీ గురు పూజోత్సవం – ఆషాఢ పౌర్ణమి – వ్యాసభగవానుని జన్మదినం

810views

జ్ఞానాన్ని తొలగించు వాడు గురువు అన్నారు. ‘జ్ఞానాన్ని కలిగించేవాడు’ అని ఎందుకు అనలేదు? ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనుభూతిలో లేదు. అజ్ఞానం కారణంగా సంకుచిత జీవనం, స్వార్ధ జీవనం గడుపుతాము. అది తొలగిపోతే జ్ఞానంతో విశాల దృక్పథం ఏర్పడుతుంది.

అందుకే ‘గురుసాక్షాత్ పరబ్రహ్మ’ అన్నారు. ఎలాగైతే శిల్పి రాయిలోని అనవసర భాగాలను తొలగించి అందులోనే విగ్రహాన్ని మలుస్తాడో అలాగే గురువు కూడా మనలోనే ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్తాడు.

అవతార పురుషులైనా గురువును ఆశ్రయించి విద్యను అభ్యసించిన వారే. శ్రీరాముడు – వశిష్ట, విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద విద్యను నేర్చుకున్నట్లు.

గురువు ఎలా లభిస్తాడు?

మనకు భగవంతుని పట్ల గల శ్రద్ధ, భక్తి ఆధారంగా భగవంతుడే అలాంటి గురువును మనకు చూపిస్తాడు. భగవంతుడు, గురువు, ఆత్మ మూడూ వేరు వేరు కాదు. ఒక్కటే అని శాస్త్రం చెబుతోంది.

వ్యాసభగవానుని జన్మదినమైన ఆషాఢ పౌర్ణమి రోజున గురుపూజ ఎందుకు నిర్వహిస్తాము?

వేదాలను ఋగ్, యజుస్, సామ, అధర్వణ అనే నాలుగు భాగాలుగా విభజించి అందులోని సారాన్ని 18 పురాణాలు రచించి, పంచమవేదంగా మహాభారతాన్ని, అందులో అంతర్భాగంగా భగవద్గీతను అందించిన మహనీయుడు కావున వారి జన్మదినం నాడు అన్ని సంప్రదాయాలకు చెందిన వారూ తమ తమ గురువులను పూజించే సంప్రదాయం ఏర్పడింది.

భగవాధ్వజాన్ని సంఘం గురువుగా ఎందుకు స్వీకరించింది?

యుగయుగాలుగా భారతదేశంలో ఒక గురు పరంపర కొనసాగుతున్నది. వారినే మనం ఋషులు, మునులు, యోగులు అంటున్నాము. వారి త్యాగమయ, తపోమయ జీవనం కారణంగా మనదేశంలో ఒక గొప్ప సంస్కృతి ఏర్పడింది. దానినే హిందూ సంస్కృతి, జీవన విధానం అంటున్నాము.

మన సంస్కృతికి ఆధారం ‘ధర్మం’ – అంటే అందరినీ కలిపి ఉంచేది (ధారణాత్ ధర్మమిత్యాహుః). ధర్మం అందరి క్షేమం కోరుతుంది. ధర్మం నశిస్తే ప్రపంచం నశిస్తుంది. అందుకే ధర్మరక్షణ కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు (ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే)

ఈ ధర్మాన్ని బోధించేవాడు గురువు. ధర్మానికీ, సంస్కృతికీ – త్యాగానికీ, సమర్పణా భావానికీ చిహ్నం, ప్రతీక అయిన భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించింది. మరొకలా చెప్పాలంటే యుగయుగాలుగా మనదేశంలో కొనసాగుతున్న ‘గురు పరంపర’కు సంకేతంగా సంఘం కాషాయ పతాకాన్ని గురువుగా స్వీకరించింది.

స్వామి వివేకానంద చెప్పినట్లు – త్యాగం, సేవ మన జాతీయ ఆదర్శాలు. ప్రపంచ దేశాల్లో ఒకచోట ధనానికీ, మరొకచోట అధికారానికీ గౌరవం ఉండవచ్చు. కానీ మనదేశంలో త్యాగధనులకే అత్యున్నత గౌరవం. వారి జీవితమే ప్రేరణ, అనుసరణీయం. అందుకే చక్రవర్తులైనా, రాజకీయ నాయకులైనా సన్యాసుల పాదాలకు నమస్కరిస్తారు.

భగవాధ్వజంలో 2 చీలికలు – పైన చిన్నగా, క్రింద పెద్దదిగా ఉంటుంది. ఈ రెండు భాగాలూ ఆధ్యాత్మిక, భౌతిక జీవితాలు రెండింటినీ సమన్వయం చేసుకుని జీవించమని సందేశం ఇస్తాయి. ప్రతి మనిషికీ 3 ధర్మాలు ఉంటాయి. అవి 1) వ్యక్తి ధర్మం 2) కుటుంబ ధర్మం 3) సమాజ ధర్మం – మూడింటికీ సమయం ఇవ్వాలి – సమన్వయం సాధించాలి.

1) వ్యక్తి ధర్మం – ఆహారం, నిద్ర, ఆరోగ్యం, అధ్యయనం, సాధన మొదలగు విషయాలు.

2) కుటుంబ ధర్మం – మాతృ, పితృ దేవోభవ – మాతా పితృ భక్తి. గృహస్థాశ్రమం, సంతానాన్ని యోగ్యమైన వ్యక్తులుగా తీర్చిదిద్దటం.

3) సమాజ ధర్మం – సమాజాన్ని పరమేశ్వర స్వరూపంగా భావించి సేవ చేయాలి. కులం, భాష, ప్రాంతం, వృత్తి ఏదైనా మనమంతా భారతమాత సంతానం, హిందువులం – బంధువులం అనే భావనతో సమాజాన్ని సంఘటిత పరచాలి. కలసి జీవించాలి – సమరసతను సాధించాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.