
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వాడి కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించారు.
హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రూ.2.5లక్షల కోట్లు వెచ్చించి సొరంగాలను ఏర్పాటు చేస్తున్నట్టు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిష్టర్ తెలిపారు. “ఢిల్లీ నుండి ముంబైకి ఎలక్ట్రిక్ హైవేని తయారు చేయాలనేది మా ప్రణాళిక. ట్రాలీబస్ లాగానే, ట్రాలీట్రక్కులను కూడా నడపవచ్చు” అని వివరించారు.
ట్రాలీబస్ అనేది ఎలక్ట్రిక్ బస్సు, ఇది ఓవర్ హెడ్ వైర్ల శక్తితో నడుస్తుంది. ఎలక్ట్రిక్ హైవే అనేది సాధారణంగా ఓవర్ హెడ్ పవర్ లైన్లతో సహా దానిపై ప్రయాణించే వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. అన్ని జిల్లాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయాలని తమ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని గడ్కరీ తెలిపారు.





