News

శివసేనకు మరో ఎదురుదెబ్బ.. సంజయ్ రౌత్‎కు ఈడీ సమన్లు..!

423views

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జూన్ 28న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరింది.

అయితే అసంతృప్త నేతలపై సంజయ్ రౌత్ హార్ట్ కామెంట్స్ చేస్తున్నారు. దమ్ముంటే ముంబయి రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో మహావికాస్ అఘాడీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. పత్రచల్ భూముల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడినట్లు సంజయ్ రౌత్ పై ఆరోపణలు ఉన్నాయి. రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్​ భూకుంభకోణంలో సంజయ్​ రౌత్​ భార్య వర్షా రౌత్​, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్​లో ఈడీ జప్తు చేసింది. ఆయన సామ్నా పత్రిక బాధ్యతలను కూడా చూస్తున్నారు.

ఇక ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ స్పందించారు. తనకు ఇప్పటికీ నోటిసులు అందలేదని.. నోటీసులు అందిన తర్వాత మాట్లాడుతానని.. అయినా మంగళవారం తనకు వేరే పనులు ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గౌహతి, ముంబై కేంద్రంగా రాజకీయం మారుతోంది. ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో పాటు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా అజయ్ చౌదరిని నియమించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమకు 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎంవీఏ ప్రభుత్వం మైనారిటీలో పడిందని కోర్టుకు ఇచ్చిన పిటిషన్ లో షిండే తెలిపారు. ఎంవీఏ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకునే యోచనలో షిండే గ్రూప్ ఉంది. ఎమ్మెల్యేల సంతాకాలతో మహారాష్ట్ర గవర్నర్ కు షిండే వర్గం లేఖ రాసింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి