
మ్యునిచ్: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు.
‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్ దాస్య శృంఖలాల్లో ఉంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు.





