
-
అపస్మారక స్థితిలో హిందూ గర్భిణి
ఇస్లాబాబాద్: పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతశిశువు మరణించడమే కాకుండా, ఆ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ హిందూ గర్భిణీకి ప్రసవం చేయడానికి ప్రయత్నించిన అనుభవం లేని వైద్య సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి తల్లి కడుపులోనే వదిలేశారు. తల్లి గర్భసంచిని కూడా చిద్రం చేశారు.
దీంతో 32 ఏళ్ళ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తార్పార్కర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన భీల్ హిందూ మహిళ, ప్రసవం నొప్పులతో తమ ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. అయితే మహిళా గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో, అనుభవం లేని సిబ్బంది ఆమెకు ప్రసవం కోసం శస్త్రచికిత్స చేసి తీరని నష్టం చేశారు.
జంషోరోలోని లియాఖత్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ గైనకాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న రహీల్ సికందర్ అక్కడ మహిళకు వైద్య సిబ్బంది చేసిన నష్టాన్ని వివరించారు. బాధితురాలిని వెంటనే వేరే ఆస్పత్రికి తరలించి గర్భంలో ఉన్న శిశువు తలను తొలగించి ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడే ప్రయత్నం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇది భయంకరమైన తప్పిదం అని సింధ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జుమాన్ బహోటోను ఈ కేసుపై వేర్వేరు విచారణలకు ఆదేశించారు. ముఖ్యంగా చచ్రోలోని ఆర్‌హెచ్‌సీలో గైనకాలజిస్టు, మహిళా సిబ్బంది లేకపోవడంతో ఏం జరిగిందో విచారణ కమిటీలు తేలుస్తాయని చెప్పారు. దర్యాప్తు మొదలైందని సమాచారం.





