News

స్వయంగా చెత్త ఎత్తిన ప్రధాని

544views

* ప్రధాని స్వయంగా స్వచ్ఛ స్పూర్తిని చాటారు – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఓ చోట స్వయంగా చెత్త ఎత్తి ‘స్వచ్ఛ భారత్‌’ సందేశాన్ని వినిపించారు.

ఢిల్లీలో నిర్మించిన ‘ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా నడవా’ను ప్రధాని మోడీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్ ‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కనిపించిన చిన్నపాటి వ్యర్థాలను ప్రధాని స్వయంగా తన చేతులతో ఎత్తారు. ఓ ప్లాస్టిక్‌ సీసానూ సేకరించారు. సంబంధిత వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ఐటీపీఓ టన్నెల్‌ ప్రారంభోత్సవం సందర్భంగానూ ప్రధాని మోడీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారు’ అని గోయల్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.

ప్రగతి మైదాన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ‌లో అంతర్భాగమే ఈ ‘ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్‌’. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ ‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సందర్శకులు ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వేగంగా ఇక్కడికి చేరుకునేలా రూ.920 కోట్లకు పైగా కేంద్ర వ్యయంతో ఈ రవాణా కారిడార్ ‌ను నిర్మించారు. ‘ఈ ప్రాజెక్టుకు కొవిడ్ ‌తో సహా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. న్యాయ వివాదాలు అడ్డువచ్చాయి. కానీ, చివరకు సాధించాం’ అని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.