
-
రాష్ట్ర సేవికా సమితి శిక్షా వర్గ ముగింపు ఉత్సవంలో డాక్టర్ విద్య
కర్నూలు: భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఇతర దేశాలకు ఆదర్శవంతంగా నిలుస్తోందని, ఈ ముందడుగులో మహిళలూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని డాక్టర్ విద్య అన్నారు. వేసవి సెలవులను పురస్కరించుకుని రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో ఇక్కడి బుధవార పేటలోని కేశవ మెమోరియల్ స్కూల్‌లో ప్రారంభిక్ శిక్షా వర్గ(శిక్షణా తరగతులు) జరిగింది. ఈ నెల ఒకటోతేదీ నుంచి ఏడోతేదీ వరకు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముగింపు ఉత్సవానికి డాక్టర్ విద్య ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ఈ ఏడు రోజులపాటు జరిగిన ఈ శిక్షణ మహిళాభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. శిక్షణార్థులు కేవలం వారం రోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకుని చక్కగా ప్రదర్శించారని కొనియాడారు.



విశాఖపట్నం నుంచి విచ్చేసిన ప్రధాన వక్త, ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహిక(కార్యదర్శి) వెంకట భాను మాట్లాడుతూ 1936 సంవత్సరంలో సేవికా సమితిని స్థాపించారని అప్పటినుండి దేశంలో మహిళల జాగృతి కొరకు సమితి పాటుపడుతుందని తెలిపారు. ఒక పురుషుడు విద్యావంతుడైతే అతనొక్కడే బాగుపడతారని, కానీ.. ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం ఉన్నతి సాధిస్తుందని తెలిపారు.
కర్నూలు జిల్లా కార్యవాహిక విశాలాక్షిమ్మ, ఇతర కార్యకర్తల సహకారంతో ఈ శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి. శిక్షా వర్గలో మహిళలకు కరాటే, వ్యాయామం, దండ, యోగాసనాలు, సూర్య నమస్కారాలలో శిక్షణ ఇచ్చారు. అంతేకాక మానసిక వికాసం కొరకు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు జరిగాయి. కథలు, పాటలు మొదలైన వాటి ద్వారా మహిళలలో ఆలోచన, అవగాహన పెంపొందేలా నిపుణులు శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుండి మొత్తం 147 మంది పాల్గొన్నారు. ముగింపు ఉత్సవంలో శిక్షణార్థులు ప్రదర్శించిన సూర్య నమస్కారాలు, ఘోష్, దండ, కరాటే, ఘన సమత, యోగా ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.





