
* హైకోర్టును ఆశ్రయించే యోచనలో నిందిత ఎమ్మెల్యేలు
రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార కూటమికి కోర్టు ద్వారా చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, రాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ లు చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో జైల్లో ఉన్న ఇద్దరు నేతలూ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో 6 రాజ్యసభ స్థానాలకు గానూ జూన్ 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో మహావికాస్ అఘాడీ తరపున శివసేన రెండు, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. భాజపా కూడా మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభలో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అయితే, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం ఉంది. 106 సభ్యులున్న భాజపా కూడా రెండుస్థానాలు తేలికగా గెలువగలదు. కేవలం ఆరో స్థానంలో మాత్రమే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం మహావికాస్ అఘాడీకి సమస్యగా మారింది.
ఇదిలాఉంటే, మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్నారు. మరో కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.





