
న్యూఢిల్లీ: పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీలు తీసుకునే కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలను రద్దు చేయగలిగే అపీలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కు తాజా ముసాయిదా సవరణలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేసన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రచురించింది.
అపీలు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా ప్రతిపాదించింది. సామాజిక మాధ్యమాల కంపెనీలు కంటెంట్ మోడరేషన్ కోసం తీసుకునే నిర్ణయాలను తోసిపుచ్చగలిగే అధికారాలను ఈ కమిటీలకు కల్పించాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గ్రీవియెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది.
ప్రతి కమిటీకి ఓ చైర్‌పర్సన్, ఇతర సభ్యులను నియమించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో ప్రచురించే నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకాలు జరగాలని పేర్కొంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీల గ్రీవియెన్స్ అధికారి కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలు తీసుకున్నపుడు, ఆ నిర్ణయాలు యూజర్‌కు సంతృప్తికరంగా లేకపోతే, ఆ యూజర్ ప్రతిపాదిత ప్రభుత్వ నియమిత అపీల్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.
Source: Nijamtoday





