
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్ 13 వరకు ఆయన దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉండాల్సి ఉంది.
కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇటీవల ఆయన్ను అరెస్టు చేసింది. జైన్ ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు దానిని మరోసారి సోమవారం వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా.. సత్యేందర్, మరికొందరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా డబ్బుతో పాటు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.





