
-
‘శ్రీరంగ’లో టిప్పుసుల్తాన్ మసీదు నిర్మించాడని ఆరోపణ
-
భారీగా పోలీసుల మోహరింపు
శ్రీరంగపట్నం: కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో నగరంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.
మాండ్యా జిల్లాలోని ఈ మసీదులో ప్రార్థనలు నిర్వహించటానికి విశ్వహిందూ పరిషత్ జూన్ నాలుగోతేదీన ‘చలో శ్రీరంగపట్నం’ పిలుపునిచ్చింది.
అయితే, శ్రీరంగపట్నంలో ఎలాంటి ప్రదర్శనకు, సభకు అనుమతి ఇవ్వబోమని మాండ్యా పోలీస్ సూపరింటెండెంట్ యతీశ్ ఎన్ విలేఖరులకు తెలిపారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా నివారించటానికి తగినంత భద్రతా ఏర్పాట్లు చేశామని, పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించామని చెప్పారు.
మసీదు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
శ్రీరంగపట్నం కోటలో ఉన్న జామియా మసీదును ఒక హనుమాన్ ఆలయాన్ని కూల్చి నిర్మించారని విశ్వహిందూ పరిషత్ వాదిస్తోంది.
అయితే.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. మస్జిద్-ఎ-అలా అని పిలిచే ఈ మసీదును టిపు సుల్తాన్ 1782వ సంవత్సరంలో నిర్మించినట్టు మసీదులో పర్షియన్ భాషలో రాసివున్న శాసనం చెప్తోంది.