News

చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో…

293views
  • ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మైనారిటీ హిందూ విద్యార్థుల గొంతు నొక్కుతోందని వెల్లడి

న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి చెందిన ఒక వీడియో సందేశం, సోషల్ మీడియాతో పాటు న్యూస్ చానళ్లలో ప్రైమ్ టైమ్ చర్చనీయాంశంగా మారింది. తన ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో రెండు నిమిషాల 14 సెకన్లు ఉన్న వీడియోను అగ్నిహోత్రి పోస్ట్ చేశారు.

తను పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రద్దు గురించి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తన సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయనివ్వకపోవడం గురించి ఆ వీడియోలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియోలో అగ్రిహోత్రి మాట్లాడుతూ…. ”మీ అందరికీ తెలిసినట్లుగానే నేను ప్రస్తుతం యూరప్‌లో ‘హ్యూమానిటీ టూర్’లో ఉన్నాను.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ పార్లమెంట్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ప్రసంగించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించాయి.

నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకీ చేరుకున్నాక, చివరి నిమిషంలో… ‘మీ సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయలేమని’ వారు నాకు చెప్పారు. కొందరు పాకిస్తానీ, ముస్లిం విద్యార్థులు నా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వల్ల ఇలా జరిగింది. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారుని కాబట్టి వారు ఇలా చేశారు.

ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నేను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంది. ప్రసంగించాల్సిందిగా కోరుతూ చాలా కాలం క్రితమే ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నన్ను ఆహ్వానించింది.

కానీ, వారు చివరి నిమిషంలో నా ప్రసంగాన్ని రద్దు చేశారు. ‘మే 31వ తేదీన పొరపాటున ఇద్దరి సెషన్లు బుక్ చేశాం. కాబట్టి మీ సెషన్‌ను 31కి బదులుగా జూన్ 1కి మార్చుతున్నాం’ అని యూనివర్సిటీ వారు చెప్పారని వివేక్ అగ్నిహోత్రి వీడియోలో అన్నారు.

ఆయన వీడియోలో ఇంకా మాట్లాడుతూ… ”వారు నా కార్యక్రమాన్ని రద్దు చేశారు. కానీ, నిజానికి వారు హిందూ మారణకాండను, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మైనారిటీలుగా ఉన్న హిందు విద్యార్థుల గొంతును నొక్కేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఒక పాకిస్తానీయుడు. దయచేసి ఈ పోరాటంలో అందరూ నాకు మద్దతుగా నిలవండి” అని ఆయన అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అగ్నిహోత్రి కార్యక్రమాన్ని రద్దు చేసిన ఘటనను ఖండిస్తూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి