News

గండి పోచమ్మ ఆలయాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడాలి

560views

దేవీప‌ట్నం: పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటమునుగుతున్న ఏజెన్సీ ప్రాంతాల ఆరాధ్య దైవం గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో కీలకమైన ఈ ఆలయాన్ని నీటమునగకుండా రక్షించాల్సిందిగా ఏజెన్సీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గొందూరు వద్ద పోలవరం ప్రాజెక్టుకు అతి సమీపంలోనే ఉన్న ఈ ఆలయం స్వయంభువుగా ఏర్పడినట్లు స్థల పురాణం చెబుతోంది.

ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ పూర్తి కావటంతో రెండేళ్ళుగా ఈ ఆలయం పూర్తిగా నీటమునిగిపోతోంది. నీటి మట్టాలు తగ్గిన తర్వాతే ఆలయం బయటపడుతోంది. ఈ ఆలయాన్ని కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయ పరిసరాల్లో ఉన్న కూడల సంగమేశ్వర ఆలయం తరహాలో రక్షణగా స్థూపాకార నిర్మాణం చేపట్టాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.

గిరిజనులే పూజారులుగా ఉండే గండి పోశమ్మ దేవాలయానికి పెద్ద సంఖ్యలో పరిసర జిల్లాల నుంచే కాక తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పాపికొండల యాత్రకు వెళ్ళే ప్రతీ బోటూ గండి పోశమ్మ దర్శనం తర్వాతే.. గోదావరి జలాల్లో విహరిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దేవాలయం చుట్టూ.. వంద మీటర్ల మేర స్థూపాకార ఆకృతిలో కాంక్రీటు నిర్మాణం చేపడితే ఈ ఆలయాన్ని ఎప్పటికీ దర్శనీయ స్థలంగానే చూడొచ్చని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

గోదావరి గట్టునే ఉన్న ఈ ఆలయం వరదల కారణంగా శిఖరం వరకూ నీటమునిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ వద్ద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి