
చెన్నై: తమిళనాడు…విరాలిమలై సమీపం తిరు ఆప్పడి గ్రామంలో నాలుగు టన్నుల రాగిరేకుల శివలింగంతో ప్రత్యేక శివాలయాన్ని నిర్మించనున్నట్టు అరుపత్తుమూవర్ తిరుప్పని ట్రస్టు వ్యవస్థాపకుడు శంకర్ తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో పన్నిరు (ద్వాదశ) తిరుమురై పద్యాలను రాగిరేకులపై పొందు పరిచే బృహత్కార్యాన్ని చేపట్టిందని, తమిళ శైవసిద్ధాంతాలను వ్యాపింప చేసిన 27 మంది తమిళ భక్తశిఖామణులు రచించిన పన్నెండు పవిత్ర గ్రంథాల సమాహారమే ‘పన్నిరు తిరుమురై’.
వీటిని తమిళ శైవులు అత్యంత పవిత్రమైన ఆరాధనీయ గ్రంథాలుగా భావిస్తారని తెలిపారు. ఇంతటి విశేషాలతో కూడిన పద్యాలను భావితరాల కోసం రాగి రేకులపై చెక్కించి, ఆ రాగి ఫలకాలతో భారీ శివలింగాన్ని రూపొందించి గర్భాలయంలో ప్రతిష్ఠించనున్నట్టు శంకర్ తెలిపారు.
విరాలిమలై సమీపం తిరు ఆప్పడి గ్రామంలో ఈ కొత్త ఆలయ నిర్మాణపు పనులు త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. పన్నిరు తిరుమురై పద్యాలను చెక్కించడానికి నాలుగు టన్నుల రాగి రేకులు అవసరమవుతాయని, వాటిని పవిత్ర యంత్రాలుగా పొందపరచనున్నామని వివరించారు.
నాయనార్లచే రూపొందించిన శైవసిద్ధాంత సారాంశాలను భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఇది చేపడుతున్నామని చెప్పారు. ఈ బృహత్కార్యంలో శైవభక్తులు, ప్రజలు పాలుపంచుకునేందుకు వీలుగా త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్ కూడా రూపొందించనున్నామని తెలిపారు.





