భాగ్యనగరం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం కైవసం చేసుకొనే దిశగా వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి తర్వాత, రెండేళ్ళ అనంతరం మొదటిసారిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తిస్థాయిలో జరుగనున్నాయి.
ఈ సమావేశాలలో పాల్గొనడానికి పార్టీ అగ్రనాయకులైన ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శాసనసభ పక్ష నాయకులతో పాటు సుమారు 400 మంది నేతలు పాల్గొంటారు.
2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మళ్ళీ 19 ఏండ్ల తర్వాత సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని పార్టీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా జరిపే అవకాశం ఉంది. నోవాటెల్ హోటల్ (హైటెక్స్ సమీపంలోని)లో కార్యవర్గ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశ స్థలం, జాతీయ కార్యవర్గ సభ్యులకు బస కల్పించే నోవాటెల్, ఇతర హోటళ్ళు, ప్రధాని బస నిమిత్తం రాజ్‌భవన్, తదితర ప్రదేశాలను పార్టీ జాతీయ నేతలు బుధవారం సందర్శించారు.
Source: Nijamtoday