
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు సామూహికంగా విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు, డివిజనల్ ఇన్‌చార్జి ఎన్ఎఫ్ఏ నవీన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ, నవధాన్యాల (PMDS) సాగులో విత్తనాలు పాడవకుండా ఉండేందుకు గోమయం, మట్టి, బూడిద మిశ్రమంతో విత్తన గుళికలు తయారు చేసి పొలాల్లో వెదజల్లవచ్చని తెలిపారు.
* ఈ విత్తన గుళికలు సుమారు ఆరు నెలల పాటు సురక్షితంగా నిల్వ ఉంటాయి.
* భూమి ఏడాది పొడవునా జీవవైవిధ్య పంటలతో కప్పబడి ఉండేందుకు సహాయపడతాయి.
* ప్రధాన పంటలకు అవసరమైన పోషకాలను అందించి భూసారాన్ని మెరుగుపరుస్తాయి.
* విత్తనాలను పక్షులు, చీమలు వంటి వాటి నుండి రక్షిస్తాయి.
* నేలలో తేమ నిల్వ ఉండటానికి దోహదపడి మొలక శాతాన్ని పెంచుతాయి.
నవధాన్యాల సాగుతో భూసారం పెంపు
రైతులు 25 నుంచి 30 రకాల నవధాన్యాల విత్తనాలను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు అందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ నవీన, రైతు సాధికార సంస్థ ఫీల్డ్ లెవల్ కేడర్ సభ్యులు, గ్రామ రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





