
కర్ణాటక: కర్ణాటక, హాసన్‌లోని ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో జిల్లాలోని అరసికెరె తాలూకాలో ఉద్రిక్తత నెలకొంది. 300 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయాన్ని చిక్క (మినీ) తిరుపతిగా అని పిలుస్తారు. ఇది అరసికెరె పట్టణానికి 2-కిమీ దూరంలో కొండపై ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉన్న విగ్రహాలను నలుగురు దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం ఆలయ ప్రాంగణానికి వచ్చిన దుండగులు కల్యాణి (ఆలయంలోని పవిత్ర జలం)లో ఈత కొట్టారని పోలీసులు తెలిపారు.
అక్కడి వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పొగ తాగడంతోపాటు ఆవరణలో పనిచేస్తున్న కూలీలను బెదిరించి వెళ్ళగొట్టారు. అనంతరం ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్ళి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను పగలగొట్టేందుకు దుండగులు రాడ్లు, ఇతర సామగ్రిని ఉపయోగించారు.
విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, జిల్లాలోని ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు దుండగులపై ఆధారాలు సేకరించారు.
ఈ వార్త తెలియగానే వందలాది మంది ఆలయ ప్రాంగణంలో గుమిగూడారు. పోలీసులు ప్రాంగణంలో భద్రతను పెంచారు. అరసికెరె తాలూకాలో కూడా గట్టి నిఘా ఉంచారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
Source: VSK Bharat





