News

తిరుమలకు కొండంత జనం

527views

* రెండేళ్ల తర్వాత తిరుమలకు పోటెత్తిన భక్తులు….

* కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం… దర్శనానికి రెండు రోజుల సమయం

రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. కొండంత జనం శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు తరలివచ్చిన రీతిలో భక్తులు సర్వదర్శనానికి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు రెండు నిండి కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో సర్వదర్శన క్యూలైన్లు వెంగమాంబ అన్నదాన సత్రం దాటిపోయింది. సర్వదర్శానికి క్యూలైన్లలోకి నారాయణగిరి ఉద్యాన వనం ప్రాంతంలో భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీ పెరిగిపోతుండటంతో వెంగమాంబ అన్నదాన సత్రం సమీపం నుంచి భక్తులను క్యూలైన్లలోని అనుమతిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న 32 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లలో సైతం భక్తులు నిండిపోయారు.

తితిదే అధికారుల అంచనాలకు మించి భక్తులు పోటెత్తుతున్నారు. టోకెన్ల జారీ విధానాన్ని తితిదే రద్దు చేయడంతో స్వామివారి దర్శనానికి భక్తులు నేరుగా వస్తున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో అప్రమత్తమైన తితిదే జాగ్రత్తలు చేపట్టింది. క్యూ లైన్ల వద్ద స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, చంటిపిల్లలు ఇబ్బందులుపడకుండా అల్పాహారం, నీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.