
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని ఆయన చెప్పారు.
‘‘ఉత్తరప్రదేశ్‌లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్, అల్విదా జుమా సందర్భంగా నమాజ్‌ను రోడ్డుపై నిర్వహించలేదు’’ అని యోగి వెల్లడించారు.
ప్రముఖ జాతీయ వారపత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ గతంలో ముజఫర్‌నగర్, మీరట్, మొరాదాబాద్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని, నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని ఆయన గుర్తు చేశారు. అయితే, గత ఐదేళ్ళలో అల్లర్లు జరగలేదని స్పష్టం చేశారు.
‘‘మా ప్రభుత్వం రాష్ట్రంలోని అక్రమ కబేళాలను మూసివేసింది. గోవులను సురక్షితంగా ఉంచడానికి మేం రాష్ట్రంలో గోశాలలను నిర్మించాం. మేం మతపరమైన ప్రదేశాల్లోని లౌడ్ స్పీకర్లను కూడా తొలగించాం. మా ప్రభుత్వం 700 కంటే ఎక్కువ మతపరమైన స్థలాలను పునర్నిర్మించింది’’ అని యోగి వివరించారు.
Source: Nijamtoday





