న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం చేసినట్టు మాలిక్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ తీర్పు చెప్పారు. తదుపరి వాదనల కోసం మే 25న జరుగుతుంది. మాలిక్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆయనను ఆదేశించింది. ఆదాయ వనరులు, ఆస్తుల వివరాలను తెలియజేయాలని తెలిపింది. ఆయనకు విధించదగిన జరిమానాను నిర్ణయించేందుకు ఆయన ఆర్థిక పరిస్థితిని మదింపు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది.
ఈ కేసుపై విచారణ జరపవలసిన జడ్జి రాకేశ్ కుమార్ శర్మ సెలవులో ఉండటంతో జడ్జి ప్రశాంత్ కుమార్ విచారణ జరుపుతారని తెలుస్తోంది. కశ్మీరులో ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశద్రోహం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరపూరిత కుట్రకు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి నేరారోపణలపై విచారణ జరిగింది.
ఉగ్రవాద చర్యలకు పాల్పడటం, ఉగ్రవాదం కోసం నిధులు సేకరించడం, ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నడం, ఉగ్రవాద ముఠా, సంస్థలో సభ్యునిగా ఉండటం, దేశద్రోహానికి పాల్పడటం వంటి నేరారోపణలపై విచారణ జరిగింది. ఈ ఆరోపణలపై తాను తన వాదనను వినిపించబోనని మాలిక్ కోర్టుకు చెప్పాడు. తాను ఈ నేరాలను చేసినట్టు అంగీకరించాడు.
జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాల కోసం నిధులను సేకరించేందుకు మాలిక్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు నమోదయ్యాయి. స్వాతంత్ర్యోద్యమం పేరుతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఎన్ఐఏ ఆరోపించింది.
Source: Nijamtoday