News

రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్‌

573views

* తల్లీబిడ్డకు సౌకర్యవంత ప్రయాణం

ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిశువులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

అదే ఫోల్డబుల్‌ ‘బేబీ బెర్త్‌’. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడక ఇది. లోయర్‌ బెర్త్ ‌కు అటాచ్‌ అయి ఉంటుంది. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్ ‌పై తమ శిశువులను పడుకోబెట్టోచ్చు. సాధారణంగా అయితే.. ఒకే బెర్త్ ‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక.. ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు బేబీ బెర్త్‌ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు.

మాతృ దినోత్సవం సందర్భంగా ఉత్తర రైల్వే మండలం ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. లఖ్‌నవూ, దిల్లీ డివిజన్ల సమన్వయంతో.. లఖన్‌ వూ మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ‌ప్రెస్ ‌లోని త్రీ-టైర్ బీ4 కోచ్‌లో ఈ బెర్త్ ‌లను పైలట్‌ ప్రాజెక్ట్ ‌గా ఏర్పాటు చేసింది. ఈ విషయమై లఖన్‌ వూ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘బేబీ బెర్త్ ‌ను మెయిన్ లోయర్ బెర్త్ ‌తో జతచేశాం. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్‌ బెర్త్‌ కిందికి మడతపెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం’ అని వివరించారు. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్ ‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి వీలుగా పట్టీలూ ఉన్నాయని అతుల్ సింగ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.