News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా

599views

కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.

27 ఏళ్ళ‌ అర్జున చౌరాసియా నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భగన్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. “మృతుని కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను. తమను కూడా కొట్టినట్టు వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోర్టును బీజేపీ ఆశ్రయించనుంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని నేను అభిప్రాయపడుతున్నాను” అని అమిత్‌షా పేర్కొన్నారు.

బెంగాల్‌లో హింస సంస్కృతి, భయానక వాతావరణం ప్రబలంగా నెలకొందని అమిత్ షా మండిపడ్డారు. “నిన్ననే టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకొని, చౌరాసియాను చంపింది” అని హోం మంత్రి మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేఖ‌రులతో అన్నారు. చౌరాసియా మృతిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోందని, దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని ఆయన వెల్లడించారు.

కోల్‌కతా విమానాశ్రయం నుంచి అమిత్‌షా నేరుగా చౌరాసియా నివాసానికి చేరుకుని అతని కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, ఇటీవల పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. దీనిని బట్టే రాష్ట్ర ప్రజలు కానీ, న్యాయవ్యవస్థ కానీ రాష్ట్ర యంత్రాంగం, పోలీసులపై విశ్వాసం కోల్పోయిన విషయం అవగతమవుతోందని మండిప‌డ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి