News

కరోనా మహమ్మారి తర్వాత సీఏఏ అమలు తథ్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

549views

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఆయన రెండు రోజులపాటు ప‌ర్య‌టించారు.

ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో షా మాట్లాడుతూ, “సీఏఏను అమలు చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రమాదం తొలగిన తర్వాత, ఈ చట్టాన్ని అమలు చేస్తాము. మన శరణార్థ సోదరులు, సోదరీమణులకు పౌరసత్వ హక్కులను కల్పిస్తామని ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్నాను” అని ప్రకటించారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రస్తావిస్తూ, “మమతా దీదీ బెంగాల్‌లోకి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తూ, మన శరణార్థ సోదరులు పౌరసత్వం పొందకుండా చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు. అయితే, సీఏఏ అనేది వాస్తవమని, అది అమలు జరిగి తీరుతుందని గుర్తించాలి. తృణమూల్ కాంగ్రెస్ దీనిని మార్చలేదు” అని స్పష్టం చేశారు.

2019లో అమల్లోకి వచ్చిన సీఏఏ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ , క్రిస్టియన్ వర్గాల వారికి పౌరసత్వం మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పశ్చిమ బెంగాల్‌ రెండు రోజుల పర్యటనలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, ఎన్నికల అనంతర హింస, అవినీతిని అరికట్టడంలో విఫలమైందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా మండిపడ్డారు. యాదృచ్ఛికంగా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.

“బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అవ‌కాశం క‌ల్పించారు. మమతా బెనర్జీ తన విధానాలను చక్కదిద్దుతారని, ఆమె పనితీరును మార్చుకోవాలని మేము ఆశించాము. ఆమె తనను తాను సరిదిద్దుకోవడానికి మేము ఒక సంవత్సరం పాటు వేచి ఉన్నాము. కానీ ఆమె మారలేదు, ”అని షా మండిప‌డ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి