
జమ్మూ: జమ్మూకశ్మీర్ పోలీసులు మొత్తం అయిదుగురు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల స్థానికేతర కార్మికులను చంపడం, వివిధ ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి అలజడి సృష్టించడం వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందనే విషయం విచారణలో తేలిందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
పండ్ల తోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పక్కా ప్రణాళికతో వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి మూడు చైనీస్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్టయిన ముగ్గురు ఉగ్రవాదులు తఫీమ్ రియాజ్, సీరత్ షాబాజ్ మీర్ , రమీజ్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించినట్టు తెలిపారు.
హెరాయిన్‌తో మరో ఇద్దరు…
మరోవైపు బారాముల్లా జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్కో టెర్రర్ మాడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరి నుంచి రూ. 1.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Source: Nijamtoday





