News

ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే

532views
  • ఐరాసను హెచ్చరించిన రష్యా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్‌ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది.

ఉక్రెయిన్‌ వైఖరి చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి, అణ్వాయుధాల ప్రయోగానికి దారి తీసే ముప్పు ఉందని తీవ్రంగా హెచ్చరించింది. పాశ్చాత్యదేశాలు, ఉక్రెయిన్‌ తమ వైఖరిని మార్చుకోకుంటే.. కీవ్‌లోని ‘విధాన నిర్ణయ కేంద్రాల’పై క్షిపణులతో విరుచుపడతామని హెచ్చరిక సంకేతం పంపింది.

తమ సేనలు క్రెమిన్నా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని ప్రకటించింది. రష్యా హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్న నాటో కూటమి దేశాల రక్షణ మంత్రులు ఉక్రెయిన్‌కు అదనపు సాయం చేస్తామని, పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని ప్రకటించారు. జర్మనీ మరో అడుగు ముందుకేసి.. విమాన విధ్వంసక ట్యాంకుల్ని ఇస్తామని హామీ ఇచ్చింది. పరిస్థితులు చేయిజారిపోతున్న తరుణంలో- ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాస్కోలో అడుగుపెట్టారు.

అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌లతో మాట్లాడారు. యుద్ధ విరమణకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా- వివిధ నగరాలు, ప్రధానంగా రైల్వే వ్యవస్థలు, ఆయుధాగారాలపై రష్యా సైనికులు విస్తృతంగా దాడులు కొనసాగించారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం మాల్దోవాలోని ట్రాన్స్‌నిస్త్రియాలో మంగళవారం ఉదయమూ పేలుళ్లు జరగడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి