
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు.
ఈ మ్యూజియం గత ప్రధాన మంత్రుల కథతో పాటు వారు ఎదుర్కొన్న వివిధ సవాళ్ల ద్వారా దేశాన్ని ఎలా నడిపించారో చెబుతోంది.ఈ మ్యూజియం స్వాతంత్య్ర పోరాటం నుంచి భారతదేశ చరిత్ర సంగ్రహావలోకనాలను అందిస్తుంది. భారత దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు ఈ మ్యూజియాన్ని మోదీ అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతావనికి ప్రధానులుగా వ్యవహరించిన వాళ్లలో ఎక్కువమంది గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చారని, ఇది దేశానికే గర్వకారణమైన విషయమని చెప్పారు.
ప్రధాన మంత్రుల జీవిత విశేషాలతో కూడిన ఈ మ్యూజియంను 75 ఏళ్ళ స్వతంత్ర భారత్‌ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియం అంతా కలియతిరిగారు. గత ప్రధానుల గురించిన జీవిత చరిత్రలను వీడియోల ద్వారా వీక్షించారు.





