
నంద్యాల: నంద్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) స్వయం సేవకులు, స్థానికులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంజీవనగర్, చందనా బోర్డు వద్ద సక్షమ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ నెల, వచ్చే నెల అంతటా కేవలం దివ్యాంగుల చేత ఈ కేంద్రం నడవనున్నది.

శ్రీరామనవమి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. శ్రీరామనవమి విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించారు. సక్షమ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి, సక్షమ్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, స్థానిక బైరమల్ వీధిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి మందిరం వద్ద ధర్మజాగరణ సమితి కార్యకర్తలు ప్రసాద వితరణ కేంద్రాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని పంచి పెట్టారు. సంఘమిత్ర సేవా సమితి, స్వామి వివేకానందా సెంటర్‌లో ప్రారంభించిన చలివేంద్రంలో శ్రీరామనవమి సంప్రదాయ పానీయమైన పానకం పంపిణీ చేశారు. ఈ చలివేంద్రంలో వెసులుబాటును బట్టి మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తుంటారు.





