
కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కశ్మీరీ హిందువులు తమ ఇళ్ళకు వెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉందని భావిస్తున్నానని చెప్పారు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రవాదం వల్ల కశ్మీరును వదిలిపెట్టామని, ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్తామని, హిందువులుగా, భారత దేశ భక్తులుగా వెళ్తామని, మా భద్రత, జీవినోపాధి పట్ల భరోసాతో వెళ్తామని కశ్మీరీ హిందువులు దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పారు. ‘‘ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా మేం జీవిస్తాం’’ అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని తెలిపారు.
గడచిన మూడు, నాలుగు దశాబ్దాల నుంచి కశ్మీరీ హిందువులు తమ స్వగృహాల నుంచి తరిమివేయబడటంతో స్వదేశంలోనే అనేక కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఓటమిని అంగీకరించకూడదని, సవాళ్ళను ఎదుర్కోవాలని చెప్పారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కశ్మీరీ హిందువులు నిరాశ్రయులైన దురదృష్టకర వాస్తవాన్ని తెలియజేసిందన్నారు. మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన దారుణాన్ని వివరించిందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే కశ్మీరీ హిందువుల సమస్య పరిష్కారమవుతుందని తాను గతంలో చెప్పానన్నారు. ఇప్పుడు అధికరణ 370 వంటి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 2011 తర్వాత మనందరి కృషి ఫలితంగా 2019 లో 370 అధికరణం అడ్డంకి తొలగిపోయిందని ఆయన చెప్పారు.





