News

‘అల్లాహో అక్బర్’ అంటూ గోరఖ్ ‌నాథ్ ఆలయంలోకి వెళ్లడానికి వ్యక్తి యత్నం, అరెస్టు

697views

అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గోరఖ్ నాథ్ ఆలయంలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించడమే కాక అడ్డుకోబోయిన ఇద్దరు ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్ల (పిఎసి)పై పదునైన ఆయుధంతో దాడి చేసిన ముర్తజా అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ ‌పూర్ జిల్లాలోని గోరఖ్ ‌నాథ్ ఆలయ దక్షిణ ద్వారం వద్ద ఆదివారం నాడు ఈ సంఘటన జరిగింది. నిందితుడిని ముర్తజాగా గుర్తించారు. బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడానికి అతడు ప్రయత్నించాడు.

“నిందితుడు పదునైన ఆయుధంతో అల్లాహో అక్బర్ అని నినదిస్తూ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సమయంలో మా పిఎసి కానిస్టేబుళ్లలో ఇద్దరు గాయపడ్డారు. అతను గేట్ సమీపంలోని పిఎసి పోస్ట్ వద్దకు వెళ్లి పోలీసులపై దాడికి ప్రయత్నించాడు” అని గోరఖ్ ‌పూర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అఖిల్ కుమార్ తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని కానిస్టేబుళ్లు పట్టుకున్నారని ఆయన తెలిపారు.

గాయపడిన కానిస్టేబుళ్లు గోపాల్ కుమార్ గౌర్, అనిల్ పాశ్వాన్‌లకు గురు గోరఖ్ ‌నాథ్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత బిఆర్‌డి మెడికల్ కాలేజీలో వారు చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. “నిందితుడు కూడా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పేరు ముర్తజా అని, గోరఖ్ ‌పూర్ నివాసి అని ప్రాథమిక విచారణలో తేలింది” అని ఎడిజి తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచూ ఈ ఆలయాన్ని సందర్శిస్తుండటంతో జరిగిన ఘటనలో ఉగ్ర కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.