News

32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు

454views

శాబ్దాలుగా తమ స్వస్థలాలకు, సంస్కృతికి, ఆచారాలకు దూరమైన కశ్మీర్ హిందువులు 370 ఆర్టికల్ రద్దుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో, భరోసాతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తమ మూలాలను వెదుక్కుంటున్నారు. తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను ఎంతో కోలాహలంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నారు. మాతా సారికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కశ్మీర్ లోయను విడిచిపెట్టినప్పటి నుంచి 32 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వీరు ‘నవ్‌రెహ్’ (కొత్త సంవత్సరం) జరుపుకోవడం ఇదే మొదటిసారి. కశ్మీర్ క్యాలెండర్ ప్రకారం నెవ్‌రెహ్ అంటే నూతన సంవత్సరంలోని తొలి రోజు అని అర్ధం.

కశ్మీర్‌ లోయలో గత రెండేళ్లుగా పరిస్థితి మెరుగైందని ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. టెర్రరిస్టు కార్యకలాపాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న సానుకూల చర్యలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, స్వస్థలాలకు తిరిగి రాగలమనే ఆశాభావంతో ఉన్నామని పలువురు చెప్పారు. ఓల్డ్ శ్రీనగర్‌లోని హబ్బా కడల్ ఏరియాలోని స్థానిక కశ్మీర్ పండిట్ ఒకరు మాట్లాడుతూ, కశ్మీర్ చుట్టూనే తన మనసు తిరుగాడుతుందని, ఇది తన జన్మభూమి అని, 1990లో కశ్మీర్ విడిచిపెట్టే సమయంలో తన తల్లిదండ్రులు హతమయ్యారని, తాను మాత్రం ఎప్పటికీ కశ్మీర్ ‌ను విడిచిపెట్టేది లేదని చెప్పారు. 32 ఏళ్లుగా ఇదే ఆలయంలో తాను ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కశ్మీర్‌లో ఈరోజు మార్పు వచ్చిందనే అనుభూతి కలిగిందని చెప్పారు. ఆలయానికి కూడా గణనీయంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.