ArticlesNews

అజాత శత్రువు డా. హెడ్గేవార్

954views

“హృదయంలో రగిలే స్వాతంత్ర్య ఇచ్చ, భిన్న దృక్పథాలు ఉన్న వ్యక్తులందరితో స్నేహ పూర్వక సంబంధాలు, వ్యక్తులలో గల సామర్థ్యాలను గుర్తించి వారిలోని గుణగణాలను వికసింపజేసి కార్యకర్తలుగా మలచే నేర్పు, వ్యక్తులను కలిపి పనిచేయించే వ్యవహార కుశలత, నిరాడంబర జీవితం, తన అనంతరం కూడా తన జీవన కార్యాన్ని కొనసాగించే అనుయాయిల బృంద నిర్మాణం…..ఇవన్నీ ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.కేశవ బలిరామ్ హెడ్గేవార్ లోని కొన్ని గొప్ప గుణాలు.

వారు 1889 ఉగాది నాడు నాగపూర్ లో జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం.వారి తండ్రి వృత్తి పౌరోహిత్యం. కేశవరావు చిన్ననాటనే తల్లిదండ్రులు ఇద్దరూ ప్లేగు వ్యాధి వల్ల ఒకే రోజు మరణించారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర:

శివాజీ జీవితం అంటే కేశవరావుకు ఎంతో ఇష్టం. చిన్న నాటనే నాయకత్వ లక్షణాలు వారిలో ఉన్నాయి. శివాజీ చిన్న వయస్సులోనే “తోరణ దుర్గం” జయించి కాషాయ పతాకాన్ని ఎగుర వేసినట్లు, నాగపూర్ లోని సీతాబర్డి కోటపై ఎగురుతున్న ఆంగ్లేయుల జెండాను దింపి అక్కడ భాగావాధ్వజాన్ని ఎగురవేయడం కోసం మిత్రులతో కలిసి సొరంగం త్రవ్వే పనికి వారు చిన్ననాటనే పూనుకున్నారు.

విప్లవ ఉద్యమాల్లో పని చేయడం కొరకే వైద్య చదువు పేరున కలకత్తా వచ్చారు. తీవ్రవాద ఉద్యమ సంస్థ ” అనుశీలన సమితి” లో చురుగ్గా పనిచేశారు. తిరిగి నాగపూర్ వచ్చి కాంగ్రెస్ లో పనిచేశారు.

విప్లవ సంస్థలలోనూ, కాంగ్రెస్ లోనూ పనిచేసే అందరితో స్నేహం కొనసాగించారు. అందరికీ సహకరించారు.

“స్వాతంత్య్రం కోసం మార్గం ముఖ్యం కాదు, ఎవరు ఏ మార్గంలో పనిచేసినా అందరినీ గౌరవించడం, అందరికీ సహకరించడం వారి విధానం.

ఆర్.ఎస్.ఎస్ ప్రారంభించక ముందు 1921లో ఒక సారి, ప్రారంభించిన తరువాత 1930లో మరొక సారి, రెండు సార్లు వారు జైలు శిక్షను అనుభవించారు. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్నది కేశవరావు బలమైన కోరిక. గాంధీజీ మొదటి నుండి మితవాది. వీరి మిత్రులు మొదట నుండి “సంపూర్ణ స్వాతంత్య్రం” కోరలేదు. లాహోర్ జాతీయ కాంగ్రెస్ మహాసభ, జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన “సంపూర్ణ స్వాతంత్య్రం” కావాలని మొదట సారి తీర్మానం చేసింది. ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతూ 1930 జనవరి 26న అన్ని అర్.ఎస్.ఎస్ శాఖలలో ఉత్సవాలను చేయాలని 21జనవరి 1930 న సర్క్యులర్ పంపారు.

భగత్ సింగ్,సుఖదేవ్, రాజ్ గురు ముగ్గురూ విప్లవ మూర్తులు. రాజ్ గురుకు అర్.ఎస్.ఎస్.తో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు ఈ ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్న వేళ రాజ్ గురును రహస్యంగా దాచడం కోసం కేశవ రావు కృషి చేశారు. రహస్య ప్రదేశంలో ఎక్కువ కాలం రాజ్ గురు ఉండలేక పోవడం వల్ల వారు పోలీసులకు దొరికి పోయారు. 1920లో నాగపూర్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహా సభల నిర్వహణకు నాయకత్వం వహించారు. 1940 లో తుది శ్వాస విడిచే వరకూ దాక్తర్జీ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

భవ్యభారత నిర్మాణం కొరకు వ్యక్తి నిర్మాణ కార్యం :

“దేశంలోని అన్ని సమస్యలకూ పరాయి ఆంగ్లేయ పాలనే కారణం అనీ, ఆంగ్లేయ పాలన అంతమైతే దేశంలోని సమస్యలు అన్నీ వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయని” ఆనాటి నాయకులు వాదిస్తూ ఉండేవారు. ఈ వాదనతో డాక్టర్ కేశవరావు విభేదించారు. “మన దేశ ప్రజలలో యే లోపాలూ లేకపోతే వేల మైళ్ల దూరం నుండి వచ్చిన కొద్ది మంది విదేశీయుల చేతుల్లో మనం ఎందుకు స్వాతంత్య్రం కోల్పోయాం? ఎందుకు ఇంకా బానిసత్వం అనుభవిస్తున్నాం?” ఈ ప్రశ్నలకు ఆనాటి ఎక్కువ మంది నాయకుల నుండి సరి అయిన సమాధానం రాలేదు.

కేశవరావు విశ్లేషణలు:

* కులం, భాష, ప్రాంతీయ భావాలతో మనం విడిపోయాం. మనం అందరం ఒకే తల్లి భారతమాత సంతానం అనే సోదరభావం మరచాం.

* కుటుంబ హితం కంటే దేశ హితం ముఖ్యమనే మౌలిక సూత్రం మరిచాం.

*సమైక్యంగా కలసి పని చేసే స్వభావం లేకుండా పోయింది.

దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ అవలంభిస్తున్న మితి మీరిన ముస్లిం సంతుష్టీకరణను కేశవరావు విభేదించారు. 1920లో కేరళ మోప్లా దుర్ఘటనలను గాంధీజీ తక్కువ చేసి చూపడం కేశవ రావుకు అస్సలు నచ్చలేదు.ఈ ఘటనలపై డా.కేశవ రావు, డా బాబా సాహెబ్ అంబేద్కర్ ల అభిప్రాయాలు ఒకే రకంగా ఉండడం గమనించవచ్చు. (వివరాలు : థాట్స్ ఆన్ పాకిస్థాన్ పుస్తకం లో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యక్తం చేసిన అంశాలు), ఆ నాటి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు మోప్లా దురాగతాలపై ఇచ్చిన నివేదికను గాంధీజీ పట్టించుకోలేదు. (వివరాలు : నా ఆత్మ కథ = ప్రకాశం పంతులు) ఈ పరిస్థితుల నేపథ్యంలో డా.కేశవరావు 1925లో హిందూ సమైక్యతకు పూనుకున్నారు.

“ప్రపంచంలో ఇస్లాం ,క్రైస్తవ మతాలు పుట్టినా, పుట్టక పోయినా, విదేశీ ఆక్రమణలు జరిగినా, జరగకపోయినా అనైక్యంగా ఉన్న హిందూ సమాజ ఐక్యత కోసం పని చేయడం అవసరం” అని వారు అన్నారు. వారి మనస్సులో హిందూ సమైక్యతకు ముస్లిం ,క్రైస్తవ వ్యతిరేకత కారణం కాదు.

1925 నుండి 1940 వరకు 15 సంవత్సరాల అల్ప కాలంలో ఆంగ్లేయుల కన్నెర్ర, కాంగ్రెస్ తో విభేదాల మధ్య దేశ వ్యాప్త సంస్థగా అర్.ఎస్.ఎస్ ను నిర్మించారు డాక్టర్జీ.”సర్వ వ్యాపి, సర్వ స్పర్శి” అనేవి వారి సూత్రాలు.

*సర్వ వ్యాపి అంటే…నాగపూర్ లో 1925 లో ప్రారంభ మయిన అర్.ఎస్.ఎస్. శాఖలు అన్ని గ్రామాలకు, నగరాలలోని అన్ని బస్తీలకు విస్తరించాలి.

* సర్వస్పర్శి అంటే అన్ని కులాలు, అన్ని వృత్తులలోకి అర్.ఎస్.ఎస్.సభ్యత్వం ప్రవేశించాలి. అంటరానితనం తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో ఎస్సీ వర్గాల ప్రజల్లో సంఘ్ ప్రవేశించింది. “ఎస్సీ.,ఎస్టీ లతో సహా అన్ని కులాల వారు సోదరులు,”ఇది మొదట నుండి సంఘ్ దృక్పథం.1933 లో గాంధీజీ, 1939లో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అర్.ఎస్.ఎస్.ను సందర్శించి సంఘంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ సభ్యులు ఉండడాన్ని ఇద్దరూ శ్లాఘించారు.

1940 లో అర్.ఎస్.ఎస్.చిన్న మొక్కగా ఉన్న సమయంలోనే డా.కేశవరావు మరణించారు. వారు తయారు చేసిన యువకులు దేశ వ్యాప్తంగా సంఘ వ్యాప్తికి విజయవంతంగా కృషి చేశారు. డా.కేశవరావు నిర్మించిన కార్యకర్తల పునాదులపై నేడు లక్షకు పైగా గ్రామాల్లో అర్.ఎస్.ఎస్.శాఖలు ఉన్నాయి. అర్.ఎస్.ఎస్.లో తయారయిన కార్యకర్తలు 40 కి పైగా వివిధ రంగాల జాతీయ సంస్థలలో పనిచేస్తున్నారు. ఎస్సీ.,ఎస్టీ., పేద వర్గాల ప్రజలలో ఒక లక్షా డెబ్బై వేల సేవా కార్యక్రమాలను నడుపుతున్నారు. తాజాగా కరోనా సమయంలో సేవా భారతి చేసిన సేవలు మరువలేనివి. చాలా మంది అర్.ఎస్.ఎస్. శక్తిని, ప్రభావాన్ని బి.జే.పి.కొలబద్దతో కొలుస్తారు.ఇది సరి కాదు.

డా.కేశవ బలిరాం హెడ్గేవార్ తన పేరు కోసం తాపత్రయ పడలేదు. నేటికీ వారి పేరు చాలా మందికి తెలియదు. ఆర్.ఎస్.ఎస్ పేరు మాత్రం చాలా మందికి పరిచయం. ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంపై అర్.ఎస్.ఎస్ సభ్యుల, కార్యక్రమాల ప్రభావం ఉంది. అర్.ఎస్.ఎస్.స్థాపించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2025 నాటికి తన కార్యక్రమాలను, సేవలను మరింతగా పెంచడానికి ఆర్.ఎస్.ఎస్.సభ్యులు వేగంగా, తీవ్రంగా పని చేస్తున్నారు..

– శ్యామ్ ప్రసాద్
సామాజిక సమరసత జాతీయ కార్యవర్గ సభ్యులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.