News

ఇక మన దేశంలోనే ముడి ఔషధాలు…

Colorful drug pills on blue background, pharmaceutical concept
405views

* చైనాపై ఆధారపడటం తగ్గే అవకాశం
* పీఎల్‌ఐ కింద స్థానిక ఫార్మా కంపెనీలకు అనుమతులు
* త్వరలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం

మందుల ఎగుమతిలో మనదేశం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆ మందులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఔషధాల కోసం చైనాపై ఆధారపడటం ఎంతోకాలంగా ఆందోళన కలిగిస్తున్న అంశం.

మందుల ఉత్పత్తిలో ఉపయోగించే ఎన్నో రకాలైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌), సాల్వెంట్స్ ‌ను దేశీయ కంపెనీలు చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సొంతంగా ఇక్కడే వీటి లభ్యత పెంపొందించేందుకు గత దశాబ్దకాలంగా ఆలోచన చేస్తున్నప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో ఆవిష్కరించిన పీఎల్‌ఐ పథకం (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) తో కొంతవరకూ ఈ పరిస్థితిలో మార్పు రానున్నట్లు స్థానిక ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి.

పీఎల్‌ఐ పథకం కింద తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలకు అనుమతులు లభించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇందులో అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అరబిందో ఫార్మా తో పాటు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌, నాట్కో ఫార్మా, బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌, సాయి లైఫ్ ‌సైన్సెస్‌, బయోఫోర్‌ ఇండియా, శ్రీకృష్ణ ఫార్మా, ఆప్టిమస్‌ ఫార్మా, కాంకార్డ్‌ బయోటెక్‌, సైమెడ్‌ ల్యాబ్స్‌, మల్లాది డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ … తదితర కంపెనీలు ఉన్నాయి. తద్వారా ముడి ఔషధాల లభ్యతను పెంపొందించటంలో ఈ కంపెనీలు క్రియాశీలకమైన పాత్ర పోషించనున్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల దేశీయ ఔషధ పరిశ్రమకు ముడి ఔషధాల వ్యయం తగ్గటంతో పాటు పొరుగుదేశంపై అధికంగా ఆధారపడకుండా కొంతవరకూ స్వయం సమృద్ధి సాధించినట్లు అవుతుందని స్థానిక వర్గాలు వివరిస్తున్నాయి. ఇప్పటి వరకూ అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న దాదాపు 35 రకాలైన ముడి ఔషధాలు, ఏపీఐలను పీఎల్‌ఐ పథకం కింద ఉత్పత్తి చేసేందుకు దేశీయ ఫార్మా కంపెనీని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ కంపెనీలు త్వరలో ముడి ఔషధాలు/ ఏపీఐల ఉత్పత్తి ప్రారంభించనున్నాయని తెలుస్తోంది. దీని కోసం అరబిందో ఫార్మా కాకినాడలో ప్రత్యేకంగా పెద్ద యూనిట్ ను‌ నిర్మిస్తోంది. ఈ యూనిట్లో త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలు పెట్టనుందని సమాచారం.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో ఫార్మా రంగానికి రూ.15,000 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని ఆవిష్కరించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనికింద మొత్తం 55 కంపెనీలను ఎంపిక చేసింది. ఈ కంపెనీలకు ఆరేళ్ల పాటు ఈ పథకం ప్రయోజనాలు లభిస్తాయి. సన్‌ ఫార్మా, మైలాన్‌, లుపిన్‌, సిప్లా, క్యాడిల్లా… తదితర అగ్రగామి దేశీయ ఫార్మా కంపెనీలు సైతం ఈ పథకం ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ముడి ఔషధాలు, ఏపీఐలతో పాటు ఫార్ములేషన్లు, బయో-ఫార్ములేషన్లు, కేఎస్‌ఎం (కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌), ఇంటర్మీడియేట్లు, వైద్య ఉపకరణాల ఉత్పత్తికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

– ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.