
విశాఖపట్నం: విశాఖలో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖకు మరింత ఆధ్యాత్మిక శోభ కల్పించేందుకు రెండు సంవత్సరాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు.
మార్చి 18వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఒడిశాలో శ్రీవారి ఆలయం పూర్తయిందని, రాబోయే రెండు నెలల్లో ఆలయం ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం పూర్తిచేసి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. కాశ్మీర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్సకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్ళలో 1000 శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.





