
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో మంగళవారం ఎనిమిది మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద బిప్లోబీ భారత్ గ్యాలరీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన బీర్‌భూమ్ దహనంపై వ్యాఖ్యానిస్తూ, “పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనపై నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
బెంగాల్ మహాభూమిపై ఇంత ఘోరమైన పాపానికి పాల్పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని, అటువంటి నేరస్తులను ప్రోత్సహించే వారిని ఎప్పటికీ క్షమించవద్దని బెంగాల్ ప్రజలను నేను కూడా కోరుతున్నాను” అని ఆయన అన్నారు. ఇలాంటి హేయమైన నేరానికి పాల్పడిన వారిని మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం చట్టానికి పట్టి ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Source: NationalistHub





