
-
ధ్రువీకరించిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు 2017లో దేశం విడిచి వెళ్ళిన కేరళకు చెందిన 23 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నజీబ్ మరణించినట్టు సమాచారం. నజీబ్ ఉగ్రవాద సంస్థలోని ఆత్మాహుతి దళం చేరి, ఓ మిషన్‌లో తనను తాను పేల్చుకుని, దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. అతని మరణాన్ని ఐఎస్‌ఐఎస్ మౌత్ పీస్ వాయిస్ ఆఫ్ ఖొరాసన్ తన తాజా సంచికలో ప్రకటించింది. అయితే, నజీబ్ ఎప్పుడు చనిపోయాడో మాత్రం వెల్లడించలేదు. అతని మరణానికి సంబంధించిన పరిస్థితులను కూడా అది వెల్లడించలేదు.
ఐఎస్‌ఐఎస్ మౌత్‌పీస్‌లోని కథనం ప్రకారం.. ఐ.ఎస్.ఐ.ఎస్ అతనిని ఆత్మాహుతి మిషన్‌లో ఉపయోగించాలనుకుంటున్నట్టు మాత్రమే సూచించింది. ఈ పనికి అతను సంతోషంగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడని పేర్కొంది. ఇతను ‘కేరళకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి’ అని తెలిపింది. అందులో నజీబ్ చిత్రాన్ని కూడా ముద్రించింది. కాగా, కేరళలోని నజీబ్ కుటుంబం అతని ఫోటో ద్వారా అతన్ని గుర్తించింది. కేరళలోని మలప్పురం జిల్లా పొన్మల నివాసి నజీబ్.. తమిళనాడులోని వెల్లూరు పట్టణంలో ఎంటెక్ చదువుతున్నాడు.
జూలై 2017లో నజీబ్ తప్పిపోయిన తర్వాత, అతని తల్లిదండ్రులు అతని కోసం వెతికారు. కానీ, అతనిని కనుగొనలేకపోయారు. ఆగస్ట్‌లో నజీబ్ అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దికాలానికి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళినట్టు కుటుంబ సభ్యులకు టెలిగ్రామ్ సందేశం పంపాడు.
2017లో తన కుటుంబానికి తన చివరి సందేశంలో, నజీబ్ కాఫీర్‌లతో పోరాడడం గురించి కూడా మాట్లాడాడు. టెలిగ్రామ్ సందేశంలో, అతను “కాఫీర్‌లతో జీవించడంలో అర్థం లేదు. నేను కాఫీర్ల ప్రపంచం నుండి తప్పించుకున్నాను” అని రాశాడు. ఖురాన్ అవిశ్వాసులను కాఫీర్లుగా బోధిస్తుంది.
Source: Organiser





