
-
శుక్ర , శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం
తిరుపతి: సర్వదర్శనాలకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలు ఉండవని స్పష్టం చేసింది. ఆ మూడురోజులు విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. సిఫార్సు లేఖలు కూడా తీసుకురావొద్దని సూచించింది. అలాంటి వారికి దర్శనం కల్పించే అవకాశమే లేదని టీటీడీ స్పష్టం చేస్తోంది.
పాలకమండలి సభ్యుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి సిఫార్సుపైనా బ్రేక్ దర్శనం కల్పించలేమని తేల్చి చెబుతున్నారు అధికారులు. విఐపిల కోసం కేటాయించిన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం భక్తుల కోసం అదనంగా దర్శన టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రోజుకు 30 వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందలేని భక్తులు..సిపార్సు లేఖలపై శుక్ర-శని-ఆదివారాల్లో వచ్చే భక్తులు.. సర్వదర్శనం టిక్కెట్లతో శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. తిరుపతి శ్రీనివాసం అతిథి గృహం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద సర్వ దర్శనం టైం స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. నిబంధనలు పాటించే భక్తులకే శ్రీవారి దర్శనం కల్పిస్తామని.. వీఐపీ దర్శనం కోసం వచ్చేవారు ఇది గమనించాలని స్పష్టం చేసింది.





