
-
ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే
ఐక్యరాజ్యసమితి: భారత్ లౌకిక దేశమని, మైనారిటీల హక్కులను కాపాడడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యకమైన అంశమని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే అన్నారు. భారతీయ పౌరులందరూ మానవ హక్కులను ఆస్వాదించేలా ప్రజాస్వామ్య సంస్థలు, పార్లమెంటు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా పరిరక్షిస్తున్నాయని తెలిపారు.
మానవ హక్కుల పరిరక్షణలో భారతదేశం ముందంజలో ఉందని ఆయన చెప్పారు. మతం, జాతులు, సాంస్కృతుల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత్ పాటిస్తోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) 49వ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
దేశంలో మహిళలు, మైనారిటీలతో సహా పౌరులందరు అన్ని ప్రాథమిక అవసరాలను పూర్తిగా తీర్చడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో దేశ అవసరాలు తీరుస్తూనే 150కిపైగా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్, మందులను అందించామని గుర్తుచేశారు. గత ఏడున్నర దశాబ్దాలుగా పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో భారత్ నడుస్తోందని స్పష్టం చేశారు.
Source: EtvBharat