దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు.
‘అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్ సిందూరే దీనికి ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయి. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేకమంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి.. జన జీవన స్రవంతిలోకి వచ్చిన అనేకమందిని మనం ఇటీవల చూశాం. దేశానికి ఇది ఒక గొప్ప విజయం’ అని పేర్కొన్నారు.




