News

సల్మాన్‌ఖాన్‌ నోట బలోచిస్థాన్‌ మాట

174views

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ .. బలోచిస్థాన్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు తెర లేపాయి. ఆయన పొరబాటున అన్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ సల్మాన్‌ ఏమన్నారంటే..?

సౌదీ అరేబియాలోని రియాద్‌ వేదికగా ‘జాయ్‌ ఫోరమ్‌ 2025’ కార్యక్రమం జరిగింది. దీనికి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా సల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలోని దక్షిణాసియా కమ్యూనిటీల్లో భారతీయ సినిమాపై ఆదరణ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే అది కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుంది. తమిళ్‌, తెలుగు, మలయాళ చిత్రాలైనా సరే ఇక్కడ రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నారు. బలోచిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు’’ అని సల్మాన్‌ వ్యాఖ్యానించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో బలోచిస్థాన్‌, పాకిస్థాన్‌ను సల్మాన్‌ఖాన్‌ వేర్వేరుగా చెప్పడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘‘పొరబాటుగా అన్నారో, ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో తెలియదు గానీ.. సల్మాన్‌ ఖాన్‌ బలోచిస్థాన్‌ ప్రజలను పాక్‌ నుంచి వేరు చేశారు. ఇది అద్భుతం’’ అని ప్రముఖ జర్నలిస్ట్‌ స్మితా ప్రకాశ్‌ పోస్ట్‌ చేశారు. బలోచిస్థాన్‌ పాక్‌లో భాగం కాదని.. తమది స్వతంత్ర దేశమని బలోచ్‌ నెటిజన్లు స్పందించారు. అయితే, నటుడి వ్యాఖ్యలు ఉద్దేశపూరితం కాదని, భౌగోళిక రాజకీయ పరిస్థితులను సినిమాల్లోకి లాగొద్దని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ చర్చపై సల్మాన్‌ గానీ, ఆయన టీమ్‌ గానీ స్పందించలేదు.

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌ బలోచిస్థాన్‌. చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్‌ ఖజానాను నింపుతోంది. అయితే, దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5 శాతం మాత్రమే. అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుంది. పేదరికం కూడా ఎక్కువే. జనాభా తక్కువగా ఉండటంతో అభివృద్ధికి దూరమైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని.. వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.