సేవా భారతి (విజయవాడ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాలమేళా’లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సేవ భారతి గత 35 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక వేల సేవా కార్యక్రమాలు నడుపుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయా ప్రాంతాలలో అవసరాలకు అనుగుణంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ విజయవాడ నగరంలో గత 30 సంవత్సరాలుగా 50 కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నడుపుతున్నది. ముఖ్యంగా వాంబే కాలనీ, వైయస్సార్ కాలనీ, మహానాడు కరకట్ట , పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట,సింగ్ నగర్, కృష్ణలంక మొదలైన వివిధ ప్రాంతాలలో అభ్యాసిక అనే పేరుతో ఉచిత సింగిల్ టీచర్ ట్యూషన్ సెంటర్ లలో సుమారు 880 మంది చిన్నారులను వారి చదువుతోపాటు దేశభక్తి పరిసరాల విజ్ఞానం, వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య అవగాహన మొదలైన విషయాలలో భావి భారత పౌరులుగా తీర్చి దిద్దుతున్నది.
ఆ ట్యూషన్ సెంటర్ల (అభ్యాసికల) వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘బాలమేళా’ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు, నృత్య రూపకాలతో అలరించారు. నాటికలతో భళా అనిపించారు. సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటం చేశారు. కార్యక్రమానికి అతిథులుగా శ్రీమతి నర్రా లలితాదేవి, శ్రీ తూనుగుంట శ్రీనివాస్, డాక్టర్ చదలవాడ సుధ, సేవాభారతి కమిటీ సభ్యులు డాక్టర్ సాయికిశోర్, శ్రీమతి పత్తి నాగలక్ష్మి, శ్రీ శుభశేఖర్, శ్రీమతి మాధురి, శ్రీ మాధవ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సహ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ మనోహర్ పాల్గొని ప్రసంగించారు.