News

తాళపత్ర గ్రంథాల మ్యూజియం

21views

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన జ్యోతిషుడు భూపేంద్రదత్‌ శర్మ 800కుపైగా అత్యంత అరుదైన తాళపత్ర గ్రంథాలు, పురాతన రాగి శాసనాలు, చారిత్రక నాణేలతో సొంత మ్యూజియం ఏర్పాటు చేశారు. తన తాత, తండ్రుల తరం నుంచి సేకరించిన గ్రంథాలు, తాళపత్రాలను ఒక ప్రత్యేక గదిలో 15 పెద్ద అరల్లో భద్రపరచినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో జ్యోతిష శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, జైన ఆగమ గ్రంథాలు ఉన్నాయని తెలిపారు. యోగ శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలతోపాటు ‘శ్రీ రామచరిత మానస్‌’లోని ఐదారు అరుదైన, పురాతన ప్రతులూ ఉన్నట్లు వెల్లడించారు. 400 ఏళ్లనాటి ‘గోరఖ్‌ మచ్ఛింద్రనాథ్‌ బోధ్‌’ గ్రంథం, సూక్ష్మ లిపి కళకు నిదర్శనంగా నిలిచే ‘శ్రీమద్‌ భగవద్గీత’ చేతిరాత ప్రతీ ఉన్నాయి. ఇంకా 16వ శతాబ్దం నాటి వివిధ భారతీయ భాషలు, లిపులతో పత్రాలు, గ్రంథాలు భద్రపరిచారు. ఈ అరుదైన సంపదను డిజిటల్‌గా భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతున్నట్లు భూపేంద్రదత్‌ తెలిపారు.