News

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక మలుపు.. NIA ఎంట్రీ

4views

విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా భావించిన అధికారులు ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులకు లేఖ రాశారు.

అయితే, విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ అధికారులు ఈ టెర్రర్ లింక్స్ కేసుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ కేసును టేకోవర్ చేసి సంబంధిత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తుల కాల్ డేటా, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధాలపై ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులకు ఇంకా ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణతో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.