NewsProgramms

దేశం మారుతోంది – శ్రీ రాంమాధవ్

358views

దేశంలో ఒకప్పుడు “మేము సెక్యులర్ వాదులం” అని చెప్పుకునేందుకు పలువురు పోటీ పడే వారని, ప్రస్తుతం “మేము హిందువులం. హిందుత్వ వాదులం” అని గర్వంగా ప్రకటించుకుంటున్నామని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారణి సభ్యులు శ్రీ రామ్ మాధవ్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా సమాలోచన ఆధ్వర్యంలో నెల్లూరులోని పి వి ఆర్ కళ్యాణ మండపంలో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. మధ్యయుగ కాలం నాటి హిజాబ్ ధారణపై కొంతమంది దేశవ్యాప్తంగా రగడ సృష్టించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని శ్రీ రామ్ మాధవ్ పేర్కొన్నారు. నిజానికి హిజాబ్ విషయం హిందూ ముస్లింల మధ్య వివాదం కాదని, విద్యావంతులైన ముస్లిం మహిళలే హిజాబ్ ధారణను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు.

భారతీయ జీవన విలువల్ని, పర్యావరణాన్ని, దేవాలయ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని శ్రీ రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు. దేశంలో నైపుణ్యతను పెంచడంతోపాటుగా భారతీయ జీవన విలువల విషయంలో కూడా శిక్షణ అందించాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు.

భారత దౌత్య సంబంధాల విషయంలో, విదేశాంగ విధానంలో, మన భూభాగాన్ని కబళించాలని చూస్తున్న పొరుగుదేశాలతో వ్యవహరిస్తున్న తీరులో గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి ఎంతో తేడా ఉన్నదని, గత ప్రభుత్వాలు అనేక విషయాలలో ఉదాసీన వైఖరిని అవలంబించాయని, ప్రస్తుత ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలకు ఎలాంటి అవకాశము ఇవ్వకుండా దేశ రక్షణే తమ ప్రథమ కర్తవ్యంగా, ప్రాధాన్య విషయంగా భావించి సాగుతోందని శ్రీ రామ్ మాధవ్ వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ శ్రీ నాగారెడ్డి హరి కుమార్ రెడ్డి, నెల్లూరు విభాగ్ సంఘచాలక్ శ్రీ పల్నాటి రామదండు, జగన్స్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ శ్రీ ఎస్వీ మధుసూదన్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 500 మందికి పైగా పాల్గొనడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.