ArticlesNews

ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం

753views

క్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరుగు. సాధారణ జనజీవనం మాత్రం అల్లకల్లోలమైపోయింది. జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు.

ఇంతటి విధ్వంసానికి, వినాశనానికి, జన హననానికి ముమ్మాటికీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీయే కారణం. ఇంతటి నష్టం జరుగుతుందని ఒక దేశాధ్యక్షుడిగా జెలెన్ స్కీకి తెలీదా? తన శక్తి సామర్ధ్యాలేవిటో, తాను కయ్యానికి కాలు దువ్వుతున్న రష్యా శక్తిసామర్థ్యాలేవిటో ఆయనకు తెలీదా? తనపై తనకు అతి విశ్వాసమా? నాటో దేశాల మద్దతు లభిస్తుందన్న అత్యాశా? ఏది ఆయనను యుద్ధం దిశగా నడిపించి ఉంటుంది?

నిజానికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఫక్తు రాజకీయవేత్త కాదు. ఆయన ఒక సినిమా నటుడు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక కమెడియన్. ఒక దేశాన్ని పాలించడం అంటే సినిమాల్లో కామెడీ చేసినట్టు కాదు కదా? రాజకీయాలలో, దేశ పాలనలో, ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో విషయాలను అనుక్షణం గమనిస్తూ, బేరీజు వేసుకుంటూ, గతాన్ని పరిశీలించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందరితోనో, ఎన్నో విధాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. అవగానా రాహిత్యమో, అతి విశ్వాసమో, వారిపై వల్లమాలిన అభిమానమో తెలీదుగానీ ఏమాత్రం పాలనానుభావం లేని సినీ పరిశ్రమకు చెందిన వారినే ఆయన తన సలహాదారులుగా, మంత్రివర్గ సభ్యులుగా పెట్టుకున్నారు.

అందునా ఉక్రెయిన్, శక్తిమంతమైన ఈయూ, రష్యాల మధ్యన ఉన్నది. ఇరు పక్షాలతోనూ సయోధ్యతో మెలగడమే సరియైన విదేశాంగ విధానం. ఏ ఒక్క పక్షాన చేరినా రెండవ పక్షానికి విరోధులవుతాం కదా? ఇద్దరు బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఇద్దరితో అణకువగా మసలుకుంటేనే కదా? లేకపోతే ఏదో ఒకనాడు ఎవరో ఒకరి చేతిలో తన్నులు తినక తప్పదు కదా? ఇది సహజమైన జీవన నియమమే కదా? మరి అంతటి దేశాధ్యక్షుడు ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా?

సరే పోనీ… ఎవరి బలాన్నో నమ్ముకుని ఈయన హద్దులు మరచి రంకెలు వేశాడనుకుందాం…. మరి వారెవరైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారా? అండగా నిలిచి ఆదుకున్నారా? ఒక బలమైన వాడితో ప్రత్యక్ష వైరం పెట్టుకోవాలంటే అవతలి వాడు కూడాఎంతటి శక్తిమంతుడైనా ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా?

నిజానికి రష్యా వంటి శక్తివంతమైన దేశాన్ని ఢీకొట్టే స్థితిలో ప్రస్తుతం అమెరికా కూడా లేనట్టే. అమెరికా కూడా పైపైన పటాటోపం ప్రదర్శించడం మినహా ఎప్పుడూ ఎక్కడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన పాపాన పోలేదు. సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటి వారి ఆచూకీ తెలుసుకుని వారిని మట్టుబెట్టడానికే అమెరికా ఎంతో సమయాన్ని, శక్తిసామర్ధ్యాలను, ధనాన్ని వెచ్చించవలసి వచ్చింది. వియత్నాం, సిరియా, లిబియా, ఇరాక్ లలో పరిస్థితులు చక్కబెడతానంటూ వెళ్లి మరింత సంక్లిష్టం చేసొచ్చింది. ఇక ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా చేసిన నిర్వాకం మనందరికీ తెలిసిందే. ఏడు సముద్రాలు ఈది ఏటి కాలువలో మునిగిన చందాన దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్థాన్లో తిష్ట వేసుకు కూర్చుని చివరికి ఆ తాలిబన్ల చేతికే ఆఫ్ఘన్ ను అప్పగించి వచ్చిన ఘన చరిత్ర అమెరికాది. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా కూడా రష్యాను ఢీకొట్టే స్థితిలో లేదు. మరి అలాంటి అమెరికా తనకు యుద్ధంలో తోడుగా నిలుస్తుందని జెలెన్ స్కీ ఆశలు పెట్టుకుని ఉంటే… అంతకంటే అమాయకత్వం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడు అమెరికా అయుధాలందిస్తానన్నా ఉక్రెయిన్ అందుకునే స్థితిలో లేదే? అందుకోడానికి ఉక్రెయిన్ చేతిలో సైనికులే లేరే?

ఉక్రెయిన్ ను నాటో దేశాల సరసన కూర్చుండబెడితే రష్యా దూకుడుగా స్పందిస్తుందని ఫ్రాన్స్, జర్మనీలతో సహా ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ ఆది నుంచి అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయ్. అయినా ఆ హెచ్చరికలన్నిటినీ తోసిరాజని అమెరికా ఉక్రెయిన్ ను నాటో అక్కున చేర్చే ప్రయత్నం చేసింది. అదే ఇప్పుడు ఇంతటి విధ్వంసానికి కారణం అయ్యింది.

ఉదాహరణకు చైనా తన మిలిటరీ బేస్ ను అమెరికా పొరుగునున్న కెనడాలోనో, మెక్సికోలోనో పెడతానంటే అమెరికా సైతం ఆ దేశాలపైకి యుద్ధానికి వెళ్లకుండా ఉంటుందా? ఏ దేశానికైనా తమ దేశ భవిష్యత్తు, భద్రత, సంక్షేమమే కదా ప్రధానం? ఇప్పుడు రష్యా కూడా సరిగ్గా అదే చేసింది. తనకు గిట్టని దేశాలతో స్నేహం కొనసాగిస్తూ తనకు పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది.

అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యవహరించిన తీరే అత్యంత అవగాహనా రహితమైనది, బాధ్యతారహితమైనది, విచారకరమైనది. జెలెన్ స్కీ తలచుకుంటే…. యుద్ధం జరుగకుండా ఆపే అవకాశం ఆయనకు చివరి క్షణం వరకూ ఉండింది. చర్చలు జరిపే అవకాశం ఉండింది. కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నమే చెయ్యలేదు. సినిమాల్లోలా హీరోయిజం ప్రదర్శించాలని, ప్రజలలో తనకున్న జనాకర్షణను మరింతగా ఇనుమడింపజేసుకోవాలని భావించాడో ఏమిటో తెలీదు. ఇంత చేస్తాం, అంత చేస్తాం, అంతు చూస్తాం అంటూ ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు రష్యాను ఏదో విధంగా చర్చలకు ఒప్పించాల్సిందిగా అందరినీ ప్రాధేయపడుతున్నాడు. ఈ జ్ఞానమేదో మొదటే ఉండుంటే ఇంత అనర్థం జరుగకపోను కదా? అది కూడా ఓసారి చర్చలకు సిద్దమనీ, మరోసారి కాదనీ ఇలా పూటకోమాట మాట్లాడుతున్నారు.

తెలివైన రాజకీయవేత్త ఎవరూ ఇలా ప్రవర్తించరు. ఈయూలోనో, రష్యాలోనో చేరే విషయమై మేం మరో పదేళ్ళ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమస్యను ఓ దశాబ్దం పాటు వాయిదా వేసుండేవారు. అసలు విషయం ఏంటంటే….. ఇంతకముందు ఉన్న అధ్యక్షుడితో ఈ విషయంలోనే విభేదించి, ఈయూలో కలుద్దామనుకుంటున్న ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి, తాను వారి కలలను నిజం చేస్తానంటూ ఓ పిచ్చి హామీ ఇచ్చి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునే వెఱ్ఱి ప్రయత్నంలో ఇలా దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేశాడు. ఇది ఆయన అపరిపక్వతకు నిదర్శనం.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటుగా, ప్రపంచ దేశాల ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే…. దేశాన్ని నడిపించే నాయకులకు కావాల్సింది గ్లామరో, గ్రామరో, హ్యూమరో కాదు. తన దేశం పట్ల అపారమైన ప్రేమ, తన దేశ ప్రయోజనాల పట్ల రాజీ లేని తత్వం, ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన. ఎవరితో ఎలా మెలిగితే తన దేశానికి ప్రయోజనమో తెలిసిన నేర్పు, ఓర్పు, పట్టువిడుపు ఉన్నవాడు, పరిస్థితులకు తగ్గట్టుగా జనాన్ని కన్విన్స్ చెయ్యగలిగినవాడే నిజమైన నాయకుడు అవగలుగుతాడు. వ్యక్తిగతమైన భేషజానికో, ప్రతిష్ఠకో ప్రాకులాడి దేశ రక్షణను, ప్రయోజనాలను ఫణంగా పెట్టేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా తన దేశ హితమే పరమార్థంగా పనిచేసేవాడు, ఎక్కడ నెగ్గాలో…. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు మాత్రమే ఏ దేశాన్నైనా ప్రగతి పథంలో నడుపగలుగుతాడు.

ప్రజలు కూడా సినీ, క్రీడా గ్లామర్ కో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో, మతానికో ప్రాధాన్యం ఇవ్వక దేశ హితమే పరమ లక్ష్యంగా భావించి, ఆలోచించి తమ నేతను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం సఫలమవుతుంది. అలా కాని పక్షంలో ప్రజాస్వామ్యమే ఏ దేశానికైనా వినాశ హేతువవుతుంది.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.