
దేశంలో కొత్త ఉగ్రవాద సంస్థ ఒకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ గుర్తించింది. ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టి… తహరీక్ ఎ తాలిబన్ హిందుస్థాన్ (టీటీహెచ్) పేరుతో పాకిస్థాన్ నుంచి దీనిని నిర్వహిస్తున్నట్టు గమనించింది. తొలి కార్యక్రమం కింద ఢిల్లీ, ఫరీదాబాద్‌ల్లోని గోడలపై టీటీహెచ్ అని రాయాలంటూ ఢిల్లీకి చెందిన క్రిమినల్ సొహాయిల్‌కు షహజాద్ పురమాయించాడు. వాటి కింద ‘ఎస్’ అని రాయాలని కూడా సూచించాడు. అది షహజాద్ సంస్థ అని చెప్పుకొనేందుకే ఈ సూచన చేశాడు. పాక్ గూఢచారి సంస్థ ఐఎ్‌సఐ సహకారంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన పోలీసు అధికారుల హత్యకు కూడా కుట్ర పన్నాడు. ఇటీవల ఢిల్లీ పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ విషయం వెల్లడయింది. ఆ ముగ్గురు యూపీలోని ఓ పోలీసు అధికారిని నాటు తుపాకీతో చంపడానికి ప్రయత్నించడం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు అబిద్ జాట్, అజ్మల్ గుజ్జర్‌లు భట్టికి సహకారం అందిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.





